అన్నీ ఇక మ్యూజియంలో
'ఎంత బావుందండీ ఈ పంచముఖి విగ్రహం. ఎక్కడ దొరికింది..?'
'ముత్యాలు, పగడాలతో విఘ్నేశ్వరుడా..! వండర్ఫుల్ డాక్టర్ గారూ'
'ఈ వినాయకుడ్ని అమెరికాలో కొనుక్కొచ్చారా.. సో నైస్'
'గమ్మత్తైన వాసన వస్తోంది. ఇది చందనంతో చెక్కిన వినాయకుడు కదూ...'
అమరవాది ప్రభాకరాచారి ఇంటికి ఎవ్వరొచ్చినా.. ఇవే అభినందనలు. ఇవే ముచ్చట్లు. ఆయన తన ఇంటి మీదున్న రెండో అంతస్తును మొత్తం గణపయ్యకు అద్దెకు కాదు, శాశ్వతంగా ఇచ్చేశారనిపిస్తుంది. అన్ని విగ్రహాలను చూసేందుకు మనకు కళ్లు చాలవు. అటు చూస్తే పగడపు స్వామి. ఇటు చూస్తే బంగారపు పూతతో మెరిసే విగ్రహం.
ఈ భూమ్మీద ఎన్ని లోహాలు దొరుకుతాయో అన్ని లోహాలతో గణపతి ఆకృతులు. బారులు తీరిన ప్రతి విగ్రహం వెనుకా ఒక జ్ఞాపకాన్ని మూటగట్టుకున్న ప్రభాకరాచారి.. వీటి కోసం జీవితమంతా ఒక యజ్ఞమే చేశారు. ఇన్నేసి విగ్రహాలను ఓపిగ్గా సేకరించాలంటే అమితమైన భక్తిభావమే కాదు, ఎనలేని అంకితభావం కూడా కావాలి. ఎందుకంటే "పురాణాలు, ఇతిహాసాల్లో ఎంతో మంది దేవతలు ఉండవచ్చు. కానీ, వినాయకునికున్న ఆకారం, ఆయన పుట్టుక నేపథ్యం ఈ లోకానికి ఆదర్శపూరితం.
అంతేకాదు, ఆ స్వామికి ఉన్నన్ని రూపాలు ఇక ఏ దేవునికీ లేవు. ఆయా ప్రాంతాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవనవిధానం అక్కడ దొరికే విగ్రహాలలో ప్రతిఫలించడం అమోఘం..'' చెప్పుకొచ్చారు ఆయన. విగ్రహాల సేకరణనేది ఆయన పనిగట్టుకుని చేసింది కాదు.. యాదృచ్ఛికంగా మొదలై.. ఆఖరికి ఒక ఉన్నతమైన లక్ష్యంగా మారిందంటూ మరిన్ని విశేషాలు చెప్పారు ఈ డాక్టరు.
బేగంబజార్ టు ఫ్లోరిడా..
ప్రభాకరాచారిది నలుగురు పిల్లలున్న కుటుంబం.. అనురాగాలు ఆప్యాయతలకు పుట్టినిల్లు. బాల్యంలో పిల్లలకు కావాల్సినవన్నీ దగ్గరుండి కొనిపెట్టడం ఆయన అలవాటు. ఆ అలవాటు నుంచే వినాయక విగ్రహాల సేకరణ మొదలుకావడం విశేషం. "మా పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. వాటిని కొనేందుకు దుకాణాలు తిరిగేవాణ్ణి. ఎందుకో వినాయక ప్రతిమలు, విగ్రహాలు నన్ను ఆకర్షించాయి. ఒక్కో దుకాణంలో ఒక్కో రూపంతో కనిపించేవి.
కాలం మారుతున్న కొద్దీ వాటి రూపురేఖలు కూడా మారిపోతుండేవి..'' అన్నారు. ఇలా మొదలైన విగ్రహాల సేకరణ ప్రయాణం హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో మొదలై అమెరికాలోని ఫ్లోరిడా వరకు వెళ్లింది. ఇప్పటికీ ఆ ప్రయాణం ఆగిపోలేదు. 'ఫ్లోరిడాలో మా పిల్లలుంటే అక్కడికి వెళ్లినపుడు ఓ సాయంత్రం ఓపెన్‌మార్కెట్‌కు వెళితే అక్కడ చైనా గణపతి కనిపించాడు. అది పంచముఖి విగ్రహం. ఇదివరకెన్నడూ నాకు కనిపించలేదు. ధర అడిగితే, 10 డాలర్లు చెప్పాడు షాపువాడు. ఆఖరికి ఆరు డాలర్లకు కొన్నాను..'' మురిపెంగా చెప్పారు ప్రభాకరాచారి.
గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక.. ఒక్కటేమిటి, ఏ రాష్ట్రం వెళ్లినా పని పూర్తవ్వగానే బజారుకు వెళ్లందే ఆయనకు నిద్రపట్టదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన వినాయకులు దేశసమైక్యతకు నిదర్శనంగా భావిస్తారు ఈ డాక్టరు. "ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రధానమైన పంట పండిస్తారు. కేరళ కొబ్బరికి పెట్టింది పేరు. అందుకే ఆ రాష్ట్రంలో కొబ్బరిచిప్పలు, కాయలతో చేసిన వినాయక విగ్రహాలు దొరికాయి. ఆలస్యం చేయకుండా కొనేశాను. సెమినార్‌కు హాజరయ్యేందుకు ఓసారి బెంగుళూరు వెళ్లాను. కర్ణాటక అడవుల్లో ఎర్రచందనం ఎక్కువ కాబట్టి.. అక్కడ వాటితోనే విగ్రహాలు తయారు చేశారు.
గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో టెర్రకోట, ఎర్రమట్టితో చేసిన విగ్రహాలు దొరికాయి. మారుమూల గిరిజన ప్రాంతాలలో అయితే అచ్చం ఆ జనం వేషధారణకు అనుగుణంగానే వినాయక ఆకృతులు తయారయ్యాయి. వాటిని కూడా తీసుకొచ్చాను. లోహాలకు ప్రసిద్ధిగాంచిన నగరాల్లో ఇత్తడి, రాగి, ఇనుము, పైబర్, రోల్డ్‌గోల్డ్‌లతో చేసిన వినాయకులను ఎక్కువగా అమ్ముతారు..'' అన్నారు. వైద్యవృత్తి మీద ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ దొరికే విగ్రహాలను కొనడం ఆయనకు అలవాటయిపోయింది. కొనడం కష్టం కాదు.
వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి హైదరాబాద్‌లోని తన ఇంటికి పంపుకోవడమే పెద్ద ప్రయాస. "కొత్త చోటికి వెళ్లినప్పుడు కొరియర్ షాపులను వెతుక్కుంటూ వెళ్లేవాణ్ణి. వాళ్లు నా వాలకం చూసి ప్యాకేజ్ డెలివరీకి ఎక్కువ డబ్బులు గుంజేవారు. ఆ విగ్రహం ఇంటికొచ్చే వరకు టెన్షన్. కొన్ని పార్శిల్స్ ఎక్కడో తప్పిపోయేవి. మరికొన్ని పగిలిపోయి ఇంటికొచ్చేవి. మళ్లీ షాపు వాడికి ఫోన్లు చేసి తెప్పించుకున్న సందర్భాలున్నాయి..'' అని తన సాధక బాధకాలు చెప్పుకొచ్చారు.
విగ్రహాల సేకరణకు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కూడా ఎంతో తోడ్పడిందట. ఏటా హైదరాబాద్‌లో జరిగే ఈ ఎగ్జిబిషన్‌కు వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు తమ ఉత్పత్తులను తీసుకొస్తారు. "నేను ఎగ్జిబిషన్‌కు వెళుతూనే వ్యాపారులు ఇట్టే గుర్తుపట్టేవారు. ఏటా వెళ్లడంతో వాళ్లు పరిచయం అయ్యారు. కొత్తగా తయారైన విగ్రహాలను నా ముందు పెట్టేవారు. అవి నాకు నచ్చకపోతే.. అడ్వాన్స్ ఇచ్చి కొత్తవి తయారు చేసి పంపమనేవాణ్ణి. క్రికెట్ ప్లేయర్‌గా, సంగీత విద్వాంసునిగా కనిపించే విగ్రహాలను అలానే తెప్పించుకున్నాను..'' అని గుర్తుచేసుకున్నారు.
సతీమణిదే సగం కృషి..
ముప్పై ఏళ్లపాటు ఇలా కూడబెట్టిన విగ్రహాలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు ప్రభాకరాచారి సతీమణి విజయలక్ష్మి. భర్త ఎప్పుడు కొత్త ఊరెళ్లినా తిరిగొచ్చేటప్పుడు ఏ రూపంలో ఉన్న కొత్త వినాయకున్ని తీసుకొస్తాడోనన్న ఆసక్తితో ఎదురుచూసేదామె. "నా భార్య కనుక విగ్రహాల బాగోగులు చూసుకోకపోతే, నేను ఎంత శ్రమపడి తీసుకొచ్చినా ఫలితం దక్కేది కాదు. ఇంటి అలమరాలన్నీ నిండిపోయినా విసుక్కోలేదు తను. రెండో అంతస్థు మొత్తాన్ని వీటికే కేటాయించింది. విగ్రహాల మీద దుమ్ముధూళి పడకుండా.. ఎప్పటికప్పుడు శుభ్రపరిచేది.
ఈ క్రెడిట్లో సగభాగం ఆమెదే..'' నన్నాడు ప్రభాకరాచారి. అర సెంటీమీటరు నుంచి అయిదు అడుగుల విగ్రహాల వరకు సేకరించారాయన. "వెనకటి రోజుల్లో రూపాయికి కూడా విగ్రహాన్ని కొన్నాను. అదే అతి చవకైనది. ఇక, అతి ఖరీదైనది అంటే లక్షరూపాయల విలువగల పగడాల హారం గణపతి. ఎందుకింత ఖరీదు అంటే.. విగ్రహానికి వేసిన హారం తయారీకి బంగారం, పగడాలు, ముత్యాలు వాడాను. అప్పట్లో తిరుపతికి వెళ్లినప్పుడల్లా వెంకటేశ్వరస్వామి బంగారు డాలర్లు తెచ్చుకునేవాణ్ణి. వాటికి కొన్ని పగడాలు, ముత్యాలు జోడించి నేనే స్వయంగా హారాన్ని చేశాను.
అందుకే అంత ఖరీదు. అపురూపంగా చూసుకునే ఈ గణపయ్యను మా ఆవిడకు కానుకగా ఇచ్చాను..'' చెపుతున్నపుడు ఆయన ముఖం మీద చిరునవ్వు మెరిసింది. 'మీరు ఇన్ని అరుదైన విగ్రహాలను సేకరించారు కదా! వీటన్నిటినీ ఏం చేస్తారు?' అంటే- "ఇన్ని విలక్షణమైన వినాయక నమూనాలు నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. నా దగ్గర మొత్తం మూడువేల విగ్రహాలు ఉన్నాయి. వాటిలో 1101 విగ్రహాలను ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టాను. ప్రభుత్వమో, స్వచ్ఛందసంస్థలో ముందుకొస్తే.. అన్ని రకాల వినాయక విగ్రహాలతో కలిపి ఒక గొప్ప మ్యూజియం ఏర్పాటు చేయాలన్నదే నా ఆశయం.
ఇది నా ఒక్కడితో జరిగే పని కాదు. పదిమంది చేతులు కలిపితేనే అవుతుంది. ఆ మహత్కార్యాన్ని కూడా ఆ వినాయకుడే పూర్తి చేస్తాడని చూస్తున్నా..'' అంటూ ఏకదంతుడిపైనే భారం వేశారు ఈ డాక్టరు. విగ్రహాల సేకరణ ఒక్కటే కాదు, ఛాయాచిత్రాలను తీయడం, ఆధ్యాత్మిక పుస్తకాలను రాయడం ప్రభాకరాచారి అభిరుచి. ఇప్పటికే 'హృదయశిల్పం', 'విశ్వగర్జన' పుస్తకాలను వెలువరించారు. ప్రస్తుతం 'అమరవేదం' పేరుతో తత్వాలను రాస్తున్నారు. వరంగల్ కోటకు సంబంధించి 500 అరుదైన ఫోటోలు తీశారు. ప్రకృతి మీద మరిన్ని ఫోటోలు తీశారు.
అప్పటి గవర్నర్ రంగరాజన్ కూడా ఆ ఫోటోల ప్రదర్శనను తిలకించి అభినందించారు. "నాకు క్లబ్బులకు వెళ్లే అలవాటు లేదు. ఆస్పత్రి నుంచి వస్తూనే పుస్తకాలతో కాలక్షేపం చేస్తాను. ఆదివారం పూట బజారుకు వెళ్లి విగ్రహాల కోసం వెతుకుతాను. ఇవే నా పనులు. గణపయ్యకు మ్యూజియం పెడితే ఈ జన్మకు మోక్షం లభించినట్లే..'' అంటున్న అమరవాది ప్రభాకరాచారి ఆశయం సిద్ధించాలని సిద్ధివినాయకున్ని వేడుకుందాం.
- మల్లెంపూటి ఆదినారాయణ
ఫోటోలు : ప్రముఖ చక్రవర్తి