ఓం శ్రీ వినాయకాయనమః

Wednesday, August 31, 2011

బొజ్జ గణపయ్య కోసం....మ్యూజియం

అన్నీ ఇక మ్యూజియంలో

రోజూ బిజీగా ఉండే ఈ కార్డియాక్ సర్జన్ ఖాళీ దొరికినప్పుడల్లా ఎవరి కోసం గాలిస్తుంటారో తెలుసా..? బొజ్జ గణపయ్య కోసం. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. పని మీద ఏ రాష్ట్రం వెళ్లినా.. ఇదే అన్వేషణ. తాను ఎన్ని సర్జరీలు చేసినా శివుడు తన కొడుకైన గణపతికి చేసిన సర్జరీయే (మనిషి రూపానికి ఏనుగు తలను అమర్చడం) ప్రపంచంలోకెల్లా అద్భుతమైనది అంటున్న ఈ వైద్యుడు.. 30 ఏళ్ల పాటు శ్రమించి.. మూడువేల వినాయక విగ్రహాలను సేకరించారు. వీటితో హైదరాబాద్‌లో ఒక మ్యూజియం పెడితే తన జన్మ చరితార్థం అవుతుందనుకుంటున్న ఆయనే అమరవాది ప్రభాకరాచారి. నేడు వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంబజార్ మహేశ్వరీభవన్‌లో ఆయన సేకరించిన వాటిలో 1101 విగ్రహాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

'ఎంత బావుందండీ ఈ పంచముఖి విగ్రహం. ఎక్కడ దొరికింది..?'
'ముత్యాలు, పగడాలతో విఘ్నేశ్వరుడా..! వండర్‌ఫుల్ డాక్టర్ గారూ'
'ఈ వినాయకుడ్ని అమెరికాలో కొనుక్కొచ్చారా.. సో నైస్'
'గమ్మత్తైన వాసన వస్తోంది. ఇది చందనంతో చెక్కిన వినాయకుడు కదూ...'
అమరవాది ప్రభాకరాచారి ఇంటికి ఎవ్వరొచ్చినా.. ఇవే అభినందనలు. ఇవే ముచ్చట్లు. ఆయన తన ఇంటి మీదున్న రెండో అంతస్తును మొత్తం గణపయ్యకు అద్దెకు కాదు, శాశ్వతంగా ఇచ్చేశారనిపిస్తుంది. అన్ని విగ్రహాలను చూసేందుకు మనకు కళ్లు చాలవు. అటు చూస్తే పగడపు స్వామి. ఇటు చూస్తే బంగారపు పూతతో మెరిసే విగ్రహం.

ఈ భూమ్మీద ఎన్ని లోహాలు దొరుకుతాయో అన్ని లోహాలతో గణపతి ఆకృతులు. బారులు తీరిన ప్రతి విగ్రహం వెనుకా ఒక జ్ఞాపకాన్ని మూటగట్టుకున్న ప్రభాకరాచారి.. వీటి కోసం జీవితమంతా ఒక యజ్ఞమే చేశారు. ఇన్నేసి విగ్రహాలను ఓపిగ్గా సేకరించాలంటే అమితమైన భక్తిభావమే కాదు, ఎనలేని అంకితభావం కూడా కావాలి. ఎందుకంటే "పురాణాలు, ఇతిహాసాల్లో ఎంతో మంది దేవతలు ఉండవచ్చు. కానీ, వినాయకునికున్న ఆకారం, ఆయన పుట్టుక నేపథ్యం ఈ లోకానికి ఆదర్శపూరితం.

అంతేకాదు, ఆ స్వామికి ఉన్నన్ని రూపాలు ఇక ఏ దేవునికీ లేవు. ఆయా ప్రాంతాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవనవిధానం అక్కడ దొరికే విగ్రహాలలో ప్రతిఫలించడం అమోఘం..'' చెప్పుకొచ్చారు ఆయన. విగ్రహాల సేకరణనేది ఆయన పనిగట్టుకుని చేసింది కాదు.. యాదృచ్ఛికంగా మొదలై.. ఆఖరికి ఒక ఉన్నతమైన లక్ష్యంగా మారిందంటూ మరిన్ని విశేషాలు చెప్పారు ఈ డాక్టరు.

బేగంబజార్ టు ఫ్లోరిడా..
ప్రభాకరాచారిది నలుగురు పిల్లలున్న కుటుంబం.. అనురాగాలు ఆప్యాయతలకు పుట్టినిల్లు. బాల్యంలో పిల్లలకు కావాల్సినవన్నీ దగ్గరుండి కొనిపెట్టడం ఆయన అలవాటు. ఆ అలవాటు నుంచే వినాయక విగ్రహాల సేకరణ మొదలుకావడం విశేషం. "మా పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. వాటిని కొనేందుకు దుకాణాలు తిరిగేవాణ్ణి. ఎందుకో వినాయక ప్రతిమలు, విగ్రహాలు నన్ను ఆకర్షించాయి. ఒక్కో దుకాణంలో ఒక్కో రూపంతో కనిపించేవి.

కాలం మారుతున్న కొద్దీ వాటి రూపురేఖలు కూడా మారిపోతుండేవి..'' అన్నారు. ఇలా మొదలైన విగ్రహాల సేకరణ ప్రయాణం హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో మొదలై అమెరికాలోని ఫ్లోరిడా వరకు వెళ్లింది. ఇప్పటికీ ఆ ప్రయాణం ఆగిపోలేదు. 'ఫ్లోరిడాలో మా పిల్లలుంటే అక్కడికి వెళ్లినపుడు ఓ సాయంత్రం ఓపెన్‌మార్కెట్‌కు వెళితే అక్కడ చైనా గణపతి కనిపించాడు. అది పంచముఖి విగ్రహం. ఇదివరకెన్నడూ నాకు కనిపించలేదు. ధర అడిగితే, 10 డాలర్లు చెప్పాడు షాపువాడు. ఆఖరికి ఆరు డాలర్లకు కొన్నాను..'' మురిపెంగా చెప్పారు ప్రభాకరాచారి.

గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక.. ఒక్కటేమిటి, ఏ రాష్ట్రం వెళ్లినా పని పూర్తవ్వగానే బజారుకు వెళ్లందే ఆయనకు నిద్రపట్టదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన వినాయకులు దేశసమైక్యతకు నిదర్శనంగా భావిస్తారు ఈ డాక్టరు. "ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రధానమైన పంట పండిస్తారు. కేరళ కొబ్బరికి పెట్టింది పేరు. అందుకే ఆ రాష్ట్రంలో కొబ్బరిచిప్పలు, కాయలతో చేసిన వినాయక విగ్రహాలు దొరికాయి. ఆలస్యం చేయకుండా కొనేశాను. సెమినార్‌కు హాజరయ్యేందుకు ఓసారి బెంగుళూరు వెళ్లాను. కర్ణాటక అడవుల్లో ఎర్రచందనం ఎక్కువ కాబట్టి.. అక్కడ వాటితోనే విగ్రహాలు తయారు చేశారు.

గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో టెర్రకోట, ఎర్రమట్టితో చేసిన విగ్రహాలు దొరికాయి. మారుమూల గిరిజన ప్రాంతాలలో అయితే అచ్చం ఆ జనం వేషధారణకు అనుగుణంగానే వినాయక ఆకృతులు తయారయ్యాయి. వాటిని కూడా తీసుకొచ్చాను. లోహాలకు ప్రసిద్ధిగాంచిన నగరాల్లో ఇత్తడి, రాగి, ఇనుము, పైబర్, రోల్డ్‌గోల్డ్‌లతో చేసిన వినాయకులను ఎక్కువగా అమ్ముతారు..'' అన్నారు. వైద్యవృత్తి మీద ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ దొరికే విగ్రహాలను కొనడం ఆయనకు అలవాటయిపోయింది. కొనడం కష్టం కాదు.

వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి హైదరాబాద్‌లోని తన ఇంటికి పంపుకోవడమే పెద్ద ప్రయాస. "కొత్త చోటికి వెళ్లినప్పుడు కొరియర్ షాపులను వెతుక్కుంటూ వెళ్లేవాణ్ణి. వాళ్లు నా వాలకం చూసి ప్యాకేజ్ డెలివరీకి ఎక్కువ డబ్బులు గుంజేవారు. ఆ విగ్రహం ఇంటికొచ్చే వరకు టెన్షన్. కొన్ని పార్శిల్స్ ఎక్కడో తప్పిపోయేవి. మరికొన్ని పగిలిపోయి ఇంటికొచ్చేవి. మళ్లీ షాపు వాడికి ఫోన్లు చేసి తెప్పించుకున్న సందర్భాలున్నాయి..'' అని తన సాధక బాధకాలు చెప్పుకొచ్చారు.

విగ్రహాల సేకరణకు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కూడా ఎంతో తోడ్పడిందట. ఏటా హైదరాబాద్‌లో జరిగే ఈ ఎగ్జిబిషన్‌కు వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు తమ ఉత్పత్తులను తీసుకొస్తారు. "నేను ఎగ్జిబిషన్‌కు వెళుతూనే వ్యాపారులు ఇట్టే గుర్తుపట్టేవారు. ఏటా వెళ్లడంతో వాళ్లు పరిచయం అయ్యారు. కొత్తగా తయారైన విగ్రహాలను నా ముందు పెట్టేవారు. అవి నాకు నచ్చకపోతే.. అడ్వాన్స్ ఇచ్చి కొత్తవి తయారు చేసి పంపమనేవాణ్ణి. క్రికెట్ ప్లేయర్‌గా, సంగీత విద్వాంసునిగా కనిపించే విగ్రహాలను అలానే తెప్పించుకున్నాను..'' అని గుర్తుచేసుకున్నారు.

సతీమణిదే సగం కృషి..
ముప్పై ఏళ్లపాటు ఇలా కూడబెట్టిన విగ్రహాలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు ప్రభాకరాచారి సతీమణి విజయలక్ష్మి. భర్త ఎప్పుడు కొత్త ఊరెళ్లినా తిరిగొచ్చేటప్పుడు ఏ రూపంలో ఉన్న కొత్త వినాయకున్ని తీసుకొస్తాడోనన్న ఆసక్తితో ఎదురుచూసేదామె. "నా భార్య కనుక విగ్రహాల బాగోగులు చూసుకోకపోతే, నేను ఎంత శ్రమపడి తీసుకొచ్చినా ఫలితం దక్కేది కాదు. ఇంటి అలమరాలన్నీ నిండిపోయినా విసుక్కోలేదు తను. రెండో అంతస్థు మొత్తాన్ని వీటికే కేటాయించింది. విగ్రహాల మీద దుమ్ముధూళి పడకుండా.. ఎప్పటికప్పుడు శుభ్రపరిచేది.

ఈ క్రెడిట్‌లో సగభాగం ఆమెదే..'' నన్నాడు ప్రభాకరాచారి. అర సెంటీమీటరు నుంచి అయిదు అడుగుల విగ్రహాల వరకు సేకరించారాయన. "వెనకటి రోజుల్లో రూపాయికి కూడా విగ్రహాన్ని కొన్నాను. అదే అతి చవకైనది. ఇక, అతి ఖరీదైనది అంటే లక్షరూపాయల విలువగల పగడాల హారం గణపతి. ఎందుకింత ఖరీదు అంటే.. విగ్రహానికి వేసిన హారం తయారీకి బంగారం, పగడాలు, ముత్యాలు వాడాను. అప్పట్లో తిరుపతికి వెళ్లినప్పుడల్లా వెంకటేశ్వరస్వామి బంగారు డాలర్లు తెచ్చుకునేవాణ్ణి. వాటికి కొన్ని పగడాలు, ముత్యాలు జోడించి నేనే స్వయంగా హారాన్ని చేశాను.

అందుకే అంత ఖరీదు. అపురూపంగా చూసుకునే ఈ గణపయ్యను మా ఆవిడకు కానుకగా ఇచ్చాను..'' చెపుతున్నపుడు ఆయన ముఖం మీద చిరునవ్వు మెరిసింది. 'మీరు ఇన్ని అరుదైన విగ్రహాలను సేకరించారు కదా! వీటన్నిటినీ ఏం చేస్తారు?' అంటే- "ఇన్ని విలక్షణమైన వినాయక నమూనాలు నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. నా దగ్గర మొత్తం మూడువేల విగ్రహాలు ఉన్నాయి. వాటిలో 1101 విగ్రహాలను ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టాను. ప్రభుత్వమో, స్వచ్ఛందసంస్థలో ముందుకొస్తే.. అన్ని రకాల వినాయక విగ్రహాలతో కలిపి ఒక గొప్ప మ్యూజియం ఏర్పాటు చేయాలన్నదే నా ఆశయం.

ఇది నా ఒక్కడితో జరిగే పని కాదు. పదిమంది చేతులు కలిపితేనే అవుతుంది. ఆ మహత్కార్యాన్ని కూడా ఆ వినాయకుడే పూర్తి చేస్తాడని చూస్తున్నా..'' అంటూ ఏకదంతుడిపైనే భారం వేశారు ఈ డాక్టరు. విగ్రహాల సేకరణ ఒక్కటే కాదు, ఛాయాచిత్రాలను తీయడం, ఆధ్యాత్మిక పుస్తకాలను రాయడం ప్రభాకరాచారి అభిరుచి. ఇప్పటికే 'హృదయశిల్పం', 'విశ్వగర్జన' పుస్తకాలను వెలువరించారు. ప్రస్తుతం 'అమరవేదం' పేరుతో తత్వాలను రాస్తున్నారు. వరంగల్ కోటకు సంబంధించి 500 అరుదైన ఫోటోలు తీశారు. ప్రకృతి మీద మరిన్ని ఫోటోలు తీశారు.

అప్పటి గవర్నర్ రంగరాజన్ కూడా ఆ ఫోటోల ప్రదర్శనను తిలకించి అభినందించారు. "నాకు క్లబ్బులకు వెళ్లే అలవాటు లేదు. ఆస్పత్రి నుంచి వస్తూనే పుస్తకాలతో కాలక్షేపం చేస్తాను. ఆదివారం పూట బజారుకు వెళ్లి విగ్రహాల కోసం వెతుకుతాను. ఇవే నా పనులు. గణపయ్యకు మ్యూజియం పెడితే ఈ జన్మకు మోక్షం లభించినట్లే..'' అంటున్న అమరవాది ప్రభాకరాచారి ఆశయం సిద్ధించాలని సిద్ధివినాయకున్ని వేడుకుందాం.

- మల్లెంపూటి ఆదినారాయణ
ఫోటోలు : ప్రముఖ చక్రవర్తి

గణేశాయనమః * వినాయకచవితి - విజ్ఞాన సమృద్ధి * గణేశచతుర్థి సందేశం - శుక్లాంబరధరం... స్ర్తీమూర్తిగా గణనాథుడు

గణేశాయనమః

విఘ్నాలను తొలగిస్తాడు కనుక విఘ్నేశ్వరుడు. సంకటాలను హరించే వాడు కనుక హేరంబుడు. సర్వలోక రక్షకుడు కనుక లంబోదరుడు. పూర్ణజ్ఞానాన్ని ప్రసాదించి, రక్షిస్తాడు కాబట్టి శూర్పకర్ణుడు. ఇలా ఎన్నో విశేషాలకు నిలయం గణనాధుడు. వివిధ రూపాల్లో, పలు నామాలతో కైమోడ్పులందుకొనే గణేశుని పండుగ నేడు. ఆ సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు అయిన గణపతిని ముందుగా పూజించి తరువాతనే ఇష్టదైవాలను ప్రార్థించడం అనూచానంగా వస్తోంది. ప్రాచీనమైన దైవంగా విఘ్నేశ్వరుని భావించి ఆయనకు గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. రుగ్వేదం గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ముందుగా పూజింపదగినవాడని తెలియచేసింది. సృష్టి మొత్తాన్ని ముప్ఫై మూడు కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతి గణపతి అని వేదాలు నిర్దేశించాయి.

అలాగే వేదాంగాలలో ఒకటైన ఛందో శాస్త్రంలోని మగణ, భగణ, జగణ, నగణ, సగణ, రగణ, తగణ, యగణములనే అష్ట గణములకు అధిష్ఠాన దేవత గణపతి. ఆ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకు కూడా ప్రభువు. ఓంకారము అన్ని ఛందస్సులకు మొదటిదని 'ప్రణవశ్చందసామివ' అని కాళిదాసు చెప్పినట్లుగా ప్రణవనాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మ­ృతి చెప్పింది.

సర్వ శుభప్రదాత

గణపతి సర్వవిద్యాధిదేవత. ప్రణవ స్వరూపుడై, శబ్దబ్రహ్మగా, ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతున్నాడు.

జ్ఞానార్థవాచకోగశ్చ, ణశ్చ నిర్వాణవాచకః!
తయోరీశం పరబ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్!

'గ' అనే అక్షరం జ్ఞానార్థ వాచకమై, 'ణ' అనే అక్షరం నిర్వాణవాచకమై 'గణ' అనే శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. దీనిద్వారా వాగధిపతి గణపతియే అని శాస్త్రం చెబుతుంది. శ్రీ గణేశ అనే సంస్కృత పదమునకు ప్రారంభం అని అర్థము. అందుకే వినాయకుడు ఆదిదేవుడు అయ్యాడు. గణ్యంతే బుధ్యంతే తే గణాః అన్నట్లు సమస్త దృశ్యమాన పదార్థాలు, గణాలు అన్నింటికీ అధిష్ఠానదేవత గణపతి. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు.

సమస్త విఘ్నాలను రూపుమాపి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. గణనాథుడు ఓంకార స్వరూపుడని గణపత్యధ్వర శీర్షం వర్ణించింది. స్వయంభువు అయిన మూలవిరాట్టు ఉద్భవించిన తరువాత ఆయన నుంచే ముక్కోటి దేవతలూ ఆవిర్భవించారు. దేవతా గణములు ఉద్భవించి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆది పురుషుడుగా గణపతి పూజలందుకుంటున్నట్లు గణేశపురాణం తెలియజే స్తోంది. గణేశుడువిష్ణుస్వరూపుడని 'శుక్లాంబరధర విష్ణుం' అన్న శ్లోకం సూచిస్తుంది.

సర్వసిద్ధి ప్రదుడు, సర్వమంత్ర దేవతారూపి, విఘ్నహరుడు, ప్రణవ స్వరూపుడుఅయిన గణపతికి అనేక రూపాలున్నాయి. వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంతో పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలి వాహనంతో మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై, సంపద బొజ్జతో ఉన్న గజాననుణ్ణి ఆరాధిస్తున్నాం.

వినాయకుని సంసారం

గణపతి దివ్య ఆవిర్భావము ఒక అద్భుత సంఘటన. నలుగుపిండిని నలిచి వినాయకుడ్ని చేసి ద్వారపాలకుడిగా నిలబెట్టింది పార్వతి. ముందు వెనుకలు చూడకుండా తనను అడ్డగించినందుకు కోపించి శివుడు అతని తల తురిమేశాడు. పిమ్మట పార్వతి విచారం చూడలేక తన గణాలను పంపి ఏనుగు తల తెచ్చి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు.

సుందరతర శుభవదనుడై, అరుణకాంతితో అలరారుతూ, జ్యోతి ప్రభలతో ప్రకాశమానమైన దివ్యాకృతితో వెలుగొందుతూ ఉన్న ఆ బాలుడు బ్రహ్మ విష్ణు రుద్రాదులకు నమస్కరించి "క్షంతవ్యశ్చాప రాధోమే మానశ్చై వేదృశో నృణామ్'' అభిమాన వంతుడనై ప్రవర్తించిన అపరాధమును మన్నించమని త్రిమూర్తులను కోరతాడు. పార్వతీ దేవి ఆ బాలుని దగ్గరగా తీసుకుని గజవదనా! నీవు శుభకరుడవు, శుభ ప్రదాతవు. ఇక నుండి సమస్త దేవతలలో ప్రథమార్చన నీకే లభిస్తుందని ఆశీర్వదిస్తుంది.

ఆనాటి నుంచి ఆ గణనాథుని ప్రథమ పూజ్యుడుగా ఆరాధించడం మొదలైందనీ, జ్ఞానంతో ముక్తి మార్గమును పొందడానికి, గణేశుని ఆవిర్భావానికి తాత్త్విక సమన్వయ సంబంధం ఉందనీ శివపురాణం అత్యద్భుతంగా విశదీకరించింది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నట్లు బ్రహ్మము అద్వయ స్వరూపశాంతియనీ, ద్వైతరూప భ్రాంతి కాదని తెలియజేయడమే గిరిజానందనుడైన గణేశుడు ఏకదంతుడవడంలోని అంతరార్థము. ప్రజాపతి తన పుత్రికలైన సిద్ధిని, బుద్ధిని గణపతికి ఇచ్చి వివాహం జరిపించాడు. సిద్ధి, బుద్ధి, గణపతులు సంతానం క్షేముడు, లాభుడు అనే వారు. కార్యసాధనలో సిద్ధి, బుద్ధితోడుగా ఉంటే లాభము, క్షేమము కలుగునని తెలియజేసే సందేశాత్మక ఆధ్యాత్మిక దృక్పథం వినాయకుని సంసారం.

ఆరాధనా ఫలం

వినాయకుని పూజించడం వల్ల శ్రీ మహాలక్ష్మీ కటాక్షము లభిస్తుందని యజ్ఞవల్క్యస్మ­ృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వ శుభాలను చేకూరుస్తుంది. త్రిపురాసురుని సంహరించేందుకు బయలుదేరినపుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధాల వల్ల ఇందుమతి రాణి గణపతి మట్టి విగ్ర హాన్ని చేసి చవితినాడు పూజించి తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగిపొందగలిగింది.

కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగముతో జన్మించినప్పటికీ గణేశుని ఆరాధించి సర్వాంగ శోభతో విరాజిల్లాడు. రుక్మాంగదుడు చింతామణి క్షేత్రంలో గణేశుని ఆరాధించి కుష్ఠువ్యాధి నుంచి విముక్తి పొందాడు. రుక్మిణీదేవి గణనాథుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయక చవితినాడు గణపతిని ఆరాధించే వారు సర్వరోగ విముక్తులై ఆరోగ్యప్రదజీవనం గడుపుతారు. సద్భుద్ధిని మేధాశక్తిని, విద్యాజయమును, అనుకూల మిత్రత్వమును, కార్య సాధననూ తక్షణమే ప్రసాదించగలడు గణనాథుడు. సర్వమూ ఆ వినాయక సమర్పితం అనే భావనతో వినాయకచవితి సభక్తికంగా జరుపుకోవాలి.

నిమజ్జనం ఆంతర్యం

తొమ్మిది రోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకువెళ్లి నీటిలో కలిపేయడం బాధాకరంగానే ఉంటుంది. కాని అది ఒక నియమం, ఒక సంప్రదాయం. నవరాత్రి ఉత్సవాలలో వినాయక విగ్రహాలను మట్టితో, ప్లాస్టిక్‌తో, పింగాణితో, రంగులతో, ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. అదే ఆలయాల్లో గానీ, ఇళ్లలో గానీ పెట్టుకునే విగ్రహాలను లోహాలతో తయారు చేస్తారు. లోహాల్లో గూడ సత్తు, ఇనుము, ఉక్కులను వాడరు.

పంచలోహ విగ్రహాలుగానీ, కంచువి, వెండివి, బంగారువి గానీ వాడతారు. అవి శాశ్వతంగా ఉంచి పూజలు చేయడానికి పనికి వస్తాయి. ఇంట్లో విగ్రహాలయితే తొమ్మిది అంగుళాలకి మించినవి వాడరాదంటారు. వాటిని రోజూ నియమ నిష్టలతో పూజించాలి. అందుకే తొమ్మిది రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి, ఎక్కడైనా ప్రవహించే నీటిలో గాని, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.

కొంతమంది 3వ రోజు, 5వ రోజులలోనే వారి వీలును బట్టి నిమజ్జనం చేస్తారు. ఆ రోజుల్లో ఇళ్లలో పెట్టిన మట్టి విగ్రహాలను కూడా నిమజ్జనానికి ఇచ్చేస్తారు. వీధి వీధిలో అట్టహాసంగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేసే ఆనవాయితీ ఆంధ్రదేశంలో ఏటేటా పెరుగుతూ వస్తోంది. అయితే ఎన్నో అలంకరణలతో మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలతో నడిచే ఈ శరీరం, ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసినదే అనే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియచేస్తుంది.

- ఇట్టేడు అర్కనందనాదేవి 

వినాయకచవితి - విజ్ఞాన సమృద్ధి * గణేశచతుర్థి సందేశం
యుగయుగాలుగా దేశవిదేశాల్లోని అన్నివార్గలవారు శ్రద్ధాభక్తులతో ఒకే పద్ధతిలో జరుపుకునే విజ్ఞానభరితమైన విశేషపర్వం వినాయకచతుర్థి. ఏది మొదలుపెట్టాలన్నా, ఏ శుభకార్యంలోనైనా ముందు విఘ్నేశ్వరపూజ తప్పనిసరిగా చేస్తాం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి అయ్యేటట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తాం.

భాద్రపద శుద్ధచతుర్థి... విఘ్నాలకు అధిపతిగా పార్వతీనందనుడు నియమింపబడిన తిథి, వినాయకుణ్ని చూసి చంద్రుడు నవ్వినందుకు పార్వతీదేవి కోపించి చంద్రుణ్ని ఎవ్వరూ చూడరాదని శపించింది. అందరూ ఆమెను ప్రార్థించగా భాద్రపద శుద్ధచతుర్థినాడు వినాయకవ్రతం చేసి, కథ విని అక్షతలు వేసుకొన్నవారు చంద్రుణ్ని చూడవచ్చునని పరిహారం చెప్పింది. అప్పటినుంచి అన్నిలోకాలలో ఈ తిథినాడు వినాయకుణ్ని పూజిస్తున్నారు.


‘గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే’ అనే వేదమంత్రం నుండి గణపతికి ప్రథమస్థానం ఏర్పడింది. జ్యేష్ఠుడుగా, బ్రహ్మకు అధిపతిగా కీర్తించబడే గణేశుణ్ని అందరికంటె ముందు పూజించాలి. ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ అని వేదశాసనం. భౌతికంగా మానవులకు ఎంతో విజ్ఞానాన్ని, సందేశాలను ఇచ్చే పండుగ ఇది ఒక్కటే.


మానవదేహంలో ఉన్న ఆరు చక్రాలలో మూలాధారచక్రం మొదటిది. దానికి అధిపతి గణపతి. పంచభూతాలలో చక్రానిది పృథివీతత్త్వం. యోగ సాధన మూలాధారం నుండి మొదలవుతుంది. భూమిపై జీవించే జీవులు గణపతి అనుగ్రహంతోనే క్రమంగా విజయాన్ని సాధించగలుగుతారు. లేకపోతే వారు చేసే కృషి ‘నేల విడిచి చేసే సాము’ అవుతుంది. మట్టిలో పుట్టి మట్టిలో మనం కలిసిపోతున్నట్లే మట్టితో చేసిన గణపతి బొమ్మను పూజించి నీటి ద్వారా మట్టిలోకి చేర్చటంలోని అంతరార్థం... రూపాన్ని పొందిన పదార్థం శాశ్వతంగా అలాగే ఉండదు అని.


సగుణోపాసన నుండి నిర్గుణపరబ్రహ్మను తెలుసుకోవాలి. ఈ పరమార్థాన్ని తెలియచేసే మట్టి ప్రతిమకు చవితినాడు పూజించాలి. మన కోరికలను అనుసరించి పూజించేటప్పుడు పసుపు, వెండి, బంగారం, నవరత్నాలతో చేసిన ప్రతిమను పూజించాలి. దానిని నిమజ్జనం చేయనక్కరలేదు. వినాయకునిరూపంలో ఎన్నోప్రత్యేకతలు ఉన్నాయి.


ఏనుగుతల దృఢదీక్షను, పెద్దచెవులు ఎదుటివారు చెప్పింది విచక్షణతో వినడాన్ని, తొండం కార్యకౌశలాన్ని, ఏకదంతం తగ్గిన అహంకారాన్ని, పెద్దనోరు ఏదైనా తినగల శక్తిని, పెద్ద పొట్ట అన్నిటినీ దాచుకోగల సామర్థ్యాన్ని, నాగయజ్ఞోపవీతం విషజంతువును యజ్ఞసూత్రంగా మలుచుకునే నిగ్రహాన్ని, నాలుగు చేతులు... చిత్తం, మనస్సు, బుద్ధి, అహంకారాలను, మూషికవాహనం చిన్నదిగా కనిపిస్తూ తనకు ఇష్టమైన దానికోసం ఎక్కడికైనా తవ్వుకుపోయే విషయవాంఛలపై అధిరోహించి తన అదుపులో పెట్టుకుని మంచిదారిలో నడిచే చాతుర్యాన్ని, వీరాసనంలో మడిచి ఉన్న ఎడమకాలు నిగ్రహించిన మనస్సును, వ్రేలాడుతున్న కుడికాలు నిర్ణయాత్మక బుద్ధిని సూచిస్తూ సాంకేతికంగా సందేశాత్మకంగా గణేశుడు రూపుదిద్దుకున్నాడు.


వినాయకచతుర్థి పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు, ఆరాధనవిధానం అంతా ప్రబోధాత్మకంగా రూపొందించబడింది. మానవులు పూజించే దేవుళ్లలో నిరాడంబరతను నేర్పేవాడు గణేశుడే. నిరుపేదలైనా మట్టితో బొమ్మ చేసుకుని తోటల్లో తిరిగి, ప్రకృతి నుండి పరిసరాలలో లభించే ఏకవింశతి (21) పత్రాలను, ద్రవ్యాలను సేకరించి పూజించవచ్చు. విలువైన ఆభరణాలు, అలంకారాలు ఆయన కోరడు. పూజామందిరంలోకి అంతరిక్షంలోని పాలవెల్లిని గణపతి మాత్రమే రప్పిస్తాడు.


వడపప్పు, పానకం, ఉడకబెట్టి చేసిన ఉండ్రాళ్లు వంటి సులువుగా తయారై ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలే స్వామికి ఇష్టం. నూనెలు, నేయి, వేపుళ్లు, తీపి, కారం పిండివంటలు కోరడు. దేహానికి వ్యాయామంగా గుంజిళ్లు తీయిస్తాడు.


‘‘నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఆరోగ్యాన్నిచ్చే మూలికలు, ఓషధులు ఉన్నాయి. వర్షఋతువులో అన్నీ పచ్చగా ఉంటాయి. పిల్లల్ని తీసుకువెళ్లి వెళ్లి వెతికి వాటిని గుర్తుపట్టు. 21 రకాల ఆకులతో నన్ను పూజించు. పనికిమాలిన చెత్త తీసుకుని వచ్చి నా నెత్తిన పెట్టకు. ఓషధులలో గరిక శ్రేష్ఠమైనది. ఇది చర్మవ్యాధుల్ని పోగొడుతుంది. నాకే కాక అమ్మవారికి కూడా ప్రీతిపాత్రమైన గరికను తెచ్చి నాకు సమర్పిస్తే దోషాలు తొలగిపోతాయి.’’


ఈ పూజ ఆడంబరం కోసం కాదు, ప్రకృతితో కలసి జీవించడం కోసం. పాడిపంటల కృషి జీవనవికాసం, శారీరక, మానసిక ఆరోగ్యవిజ్ఞానం కోసం, తరాల మధ్య అంతరాలు తొలగి అనుబంధాలు పెరగటం కోసం. తల్లిదండ్రులపై గౌరవం ఇనుమడించటం కోసం. తోబుట్టువులు సఖ్యతతో ఉండటం కోసం. హాస్యరసాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రవర్తనను తీర్చిదిద్దడం కోసం. సత్రాజిత్తులా సంపదలు రాగానే అహంకరించకూడదని చెప్పడం కోసం.


భగవంతుడైనా తనపై వచ్చిన అపనిందలను తొలగించుకోవాలని తెలియటం కోసం. బుద్ధి సక్రమంగా ఉంటే నా అనుగ్రహంతో విజయసిద్ధి అవుతుందని గ్రహించటం కోసం... అని గణేశుడు వినాయకచతుర్థి ప్రయోజనాలను వరద అభయహస్తాలతో సూచిస్తున్నాడు. ఒకవేళ వ్రతం చేయలేకపోతే -
సింహః ప్రసేనమవధీత్ సింహాజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవహ్యేష శ్యమంతకః
(నిర్ణయసింధువు)
అనే శ్లోకాన్ని చదువుకుంటే చంద్రదర్శనం వలన నీలాపనిందలు రాకుండా ఉంటాయి. మొక్కుబడిగా కాకుండా, వివేకంతో విజ్ఞానాత్మకమైన వినాయకచతుర్థి వ్రతాన్ని జరుపుకుని, విద్యాసంపదను పొందుదాం. గణేశుని కృపకు పాత్రులమవుదాం.

- డా.పాలపర్తి శ్యామలానందప్రసాద్
శుక్లాంబరధరం... స్ర్తీమూర్తిగా గణనాథుడు
చిన్నా, పెద్ద ఆనందోత్సాహాలతో నిర్వహించే వినాయకచవితి హిందువులందరికీ ఎంతో ముఖ్యమైంది. నిగూఢఅర్థాలెన్నో వినాయకుడి రూపంలో దాగి ఉన్నారుు. పురాణగాధ అని కొందరు భావిస్తే, ఆరోగ్య రహస్యాలు, విశ్వరహస్యాలు దాగి ఉన్నాయని భావించే వారు మరికొందరు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా వినాయకుడికి మాత్రం ఏటేటా ప్రాచుర్యం పెరుగుతూనే ఉంది. వినాయకుడిని స్ర్తీరూపంలోనూ ఆరాధించిన దాఖలాలు ఉన్నారుు. వినాయకుడికి పెట్టే పత్రి లోనూ ఎన్నో విశేషాలున్నారుు. వీటన్నింటిపై ప్రత్యేక కథనం...

ganeshశక్తిస్వరూపుడైన గణనాథుడిని స్ర్తీమూర్తిగా కూడా ఆరాధించిన దాఖలాలు ఉన్నాయి. వినాయకి, విఘ్నేశ్వరి, గజానని...ఇలా ఎన్నో పేర్లతో స్ర్తీ మూర్తిగా వినాయకుడిని ఆరాధించినట్లుగా చెబుతారు. స్కరదపురాణం, బ్రహ్మవైవర్స పురాణాల్లో ఈ ప్రస్తావన ఉంది. మనదేశంలో క్రీ.శ 5వ శతాబ్ది నుంచి గణపతి పూజ చేస్తున్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. దేవీ సహస్ర నామాల్లో ంబోదరి, గణేశ్వరి, విఘ్నేశ్వరి అనే నామాలున్నాయి.

విభిన్న రూపాలు...
షోడశరూపాల్లో గణనాథుడిని పూజిస్తారు. జైన మతస్తులు గణేశ్వరి, వైనాయకి పేరుతోను, బౌద్ధులు గణపతి హృదయ అనే పేరుతోనూ స్ర్తీ మూర్తి ఆరాధన చేశారు. వినాయక ప్రతిమల్లో ఏనుగు ముఖం కలిగి మకుటం కలిగిన ప్రతిమను లంబోలిగా పేర్కొన్నారు.అంధకాసుర సంహారానికి పరమేశ్వరుడు జగన్మాత మాతృరూపాలను సృజించగా, వారిలో అత్యున్నత శక్తిసంపత్తి గల వినాయకి, గణేషుని పేరుతో తక్కిన మాతృగణాలకు ఆధిపత్యం వహించి రాక్షస సంహారం చేసినట్లు పురాణగాధ ఉంది. ‘గణపతి హృదయం’, ఏకముఖి, ద్విభుజి, వరదభము, నృత్యాసనమే అంటే ఏకముఖం కలిగి ద్విభుజాలతో అభయవరదాలతో నృత్యాసనంలో ఉంటుందన్న భావాన్ని కలిగిస్తూ బౌద్ధమత గ్రంథకర్తయైన అమృతానందుడు గణపతి రూపాన్ని వర్ణించాడు.

vinayaki 
గుప్తుల కాలం నుంచి విజయనగర రాజుల కాలం వరకు వైనాయకి అనేక దేవాలయాల్లో వివిధ ఆసనాలతో వివిధ భంగిమలతో రూపధారణ చేసింది. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో స్ర్తీ మూర్తి విగ్రహాలు తక్కువగా కన్పిస్తాయి. శుచీంద్రంలో చతుర్భుజిగాను, చిదంబరం పళినిలలో అర్థభాగం స్ర్తీమూర్తిగాను, అర్థభాగం వ్యాఘ్రరూపంలోనూ ఉంటుంది. క్రీ.శ. 9వ శతాబ్దికి చెందిన ఓ విగ్రహంలో వినాయకి ఏనుగును అధిష్ఠించి, కుడిచేతిలో పండును, ఎడమ చేతిలో వజ్రాన్ని ధరించినట్లుగా ఉంది. ఈ విగ్రహం ఉత్తరప్రదేశ్‌లో లభ్యమైంది. మధ్యప్రదేశ్‌లో క్రీ.శ 10వ శతాబ్దం నాటి మూషిక వాహని వినాయకి విగ్రహం లభ్యమైంది. జటామకుటధారిణిగా ఇందులో వినాయకిని చెక్కారు.

గ్వాలియర్‌ మ్యూజియంలో వినాయకి మకుటధారిణిగా, లంబోదరిగా నాలుగు చేతులతో వివిధ పాత్రలను ధరించి, త్రిభంగిలో తైత్రీయ హార శోభితంగా ఉంది. తొలికాలంలో రెండు చేతులతోను, ఆ తరువాతి కాలంలో నాలుగు చేతులతోనూ వినాయకి విగ్రహాలను రూపొందించారు. కోల్‌కతా మ్యూజియంలో పద్మాసినిగా పద్మపీఠంపై, యజ్ఞోపవీత ధారిణిగా వినాయకి విగ్రహం ఉంది. బ్రాహ్మణత్వం, రాజసత్వం కలిగి అన్ని కాలాల్లోనూ వినాయకి పూజలందుకొంది.

పత్రి పూజ...
vinayakis 
వినాయక చవితి నాడు 21 రకాల పత్రితో పూజిస్తారు. ఆ పత్రాలకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వీటిని పూజాద్రవ్యాలుగా ఉపయోగించాలని పెద్దలు సూచించారు.
  • మాచిపత్రి: దీని కషాయం దద్దుర్లు తగ్గడానికి, వ్రణాలకు వాడుతారు. తలనొప్పులకు, చర్మవ్యాధులకు పని చేస్తుంది. కళ్ళకు చలువ చేస్తుంది. పొట్టకు బలం ఇస్తుంది. మానసిక వికాసానికి తోడ్పడుతుంది.
  • బృహతీపత్రం: దీన్ని వాకుడాకు అని కూడా అంటారు. ఓ విధమైన ముళ్ళ చెట్టు ఇది. ఉబ్బు, శ్లేష్మ, క్షయ, ఉబ్బసపు దగ్గు, తాపాన్ని తగ్గిస్తుంది.బిల్వ పత్రం: దీన్నే మారేడు అని కూడా అంటారు. శివుడికి ప్రీతి. త్రిదళ పత్రి క్ష్మీ స్వరూపం. బంక విరోచనాలు తగ్గిస్తుంది. చాటలకు దీని గుజ్జు రాస్తారు. పుచ్చులు రాకుండా కాపాడుతుంది. సాధారణంగా శివాలయాల్లో ఈ పత్రాలు లభిస్తాయి.
  • గరిక: మెత్తగా నూరి గాయాలకు కడితే మానుతాయి.
  • దతుర పత్రం: నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త - దీని ఆకులకు నూనె రాసి వ్రణాలకు వాడుతారు. లైంగిక పరమైన వ్యాధులకు ఉపయోగిస్తారు.
  • బదరీపత్రం: రాగి చెట్టు ఆకులు. జీర్ణకోశవ్యాధులకు, రక్తదోషాలను హరించేందుకు ఉపయోగిస్తారు. మిరియంతో కలిపి తింటారు. ఆకుల నురుగు రాస్తే అరికాళ్ళ, అరి చేతుల మంటలు తగ్గుతాయి.
  • అపాముర్గ పత్రం: దీన్నే ఉత్తరేణి అంటారు. పంటి జబ్బులకు దీని వేర్లు ఉపయోగిస్తారు.
  • తులసీపత్రం: లక్ష్మితులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, రామ తులసి...ఇలా ఎన్నో రకాలున్నాయి. అజీర్ణం, కడుపునొప్పి, గర్భ శూల, చర్మరోగాలు, తేలుకాటులకు ఉపయోగిస్తారు. పసిబిడ్డల కు మంచిది. యాంటీసెప్టిక్‌గా కూడా ఉపయోగపడుతుంది.
  • మామిడి: మేహకారక మంటలు, రక్త అతిసారను తగ్గిస్తుంది.
  • కరవీరపత్రం: గన్నేరు అని కూడా అంటారు. దురదలు, దద్దుర్లు, గడ్డలు, కంతులు, జంతు విషాలను తగ్గిస్తుంది. చర్మరోగాలు తగ్గిస్తుంది.
  • విష్ణుక్రాంత: నీలపుష్టి అంటారు. కఫం, పైత్యం, జ్వరం, ఉబ్బులకు ఉపయోగిస్తారు. వీటి ఆకులు ఎండబెట్టి ఆకు పొగ పీలిస్తే ఉబ్బస వ్యాధులు తగ్గుతాయి.
  • దానిమ్మ ఆకు: వగురుగా ఉండి జీర్ణకోశ వ్యాధులు తగ్గిస్తుంది. మలాశయ వ్యాధులను అరిడుతుంది. నీళ్ళవిరోచనాలను తగ్గిస్తుంది. ఏలిక పాముల బెడదను తగ్గిస్తుంది.
  • దేవదారు పత్రం: లేత చిగుళ్ళు మేహశాంతిని కలిగిస్తాయి. ఆకుల తైలం కళ్ళకు చలువ చేస్తుంది.
  • హదుక పత్రం: దీన్నే మరువం అంటారు. జీర్ణశక్తిని, ఇంద్రియ పుష్టిని, ఆకలిని కలిగిస్తుంది. కేశరోగాలు తగ్గిస్తుంది. పరిమళద్రవ్యంగా ఉపయోగిస్తారు.
  • సింధూర పత్రం:వావిలాకు- జ్వరాలకు, జ్వరదోషాలకు, కీళ్ళనొప్పులు, వాపులకు వాడుతారు.
  • జాజి ఆకులు: వాతానికి, పైత్యానికి మందు. జీర్ణాశయ, మలాశయ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. నోటిపూత, కామెర్లు తగ్గించేందుకు వాడుతారు. బుద్ధి బలానికి మంచి మందు. చర్మ, కాలేయ రోగాలు, పక్షవాతం, తలనొప్పి, గవదబిళ్ళలు తగ్గిస్తుంది.
    గణక పత్రం: దీన్నే గండకి లేదా వినాయకపత్రంగా వ్యవహరిస్తారు. కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే లభిస్తుంది.
  • జమ్మిపత్రం: కఫం, మూలవ్యాధి, దీర్ఘకాలిక చర్మవ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
  • రావిపత్రం: దీని చెక్క ఎండబెట్టి నీరు చేర్చి ద్రావణం కాచి చర్మవ్యాధులకు వాడుతారు. ఈ చెట్టు గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు. దేవతావృక్షమని అంటారు. 40 రోజుల పాటు 40 ప్రదక్షిణలు చేస్తే మంచిదని చెబుతారు.
  • అర్జున పత్రం: మద్ది చెట్టు- దీని కలపతో గృహోపకరణాలు చేస్తారు.
  • అర్కపత్రం: జిల్లేడు - దీని కాండంతో చేసిన వినాయకుడిని పూజిస్తే సకల కార్యాలు నెరవేరుతాయని అంటారు. చర్మవ్యాధులను తగ్గించేందుకు ఈ పత్రాలను ఉపయోగిస్తారు.
    - ఎన్‌. వాణీ ప్రభాకరి

Tuesday, August 30, 2011

సత్యప్రమాణాల దేవుడు*శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి

సత్యప్రమాణాల దేవునిగా విరాజిల్లుతున్న శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా ఉన్న సిద్ధి వినాయక దేవస్థానాల్లో ఎంతో పేరెన్నికగన్నది. కోరిన కోర్కెలు తీర్చే స్వయంభువుగా కాణిపాకం వినాయకుడు ప్రసిద్దిగాంచారు. ఇరు వర్గాలు, ఇద్దరు వ్యక్తులు మద్యన ఏదైనా సమస్య వస్తే స్వామి ముందు ప్రమాణం చేస్తే అదే తుది నిర్ణయం. ఇక్కడ వినాయకస్వామి వారే న్యాయ నిర్ణేత అని భక్తుల నమ్మకం.

Kanipakam_Vinayaka 

ప్రతి ఏటా వినాయక ప్ర తిమ పెరుగుతూ భక్తుల ను అలరిస్తోంది. చెక్కు చెదరని శిల్పసౌందర్యం కాణిపాకానికే సొం తం. పర్యాటకులకు కనువిందు చేసే పుణ్యక్షేత్రంగా ప్రసిద్దిగాంచిన కాణిపాక క్షేత్రం భక్తుల రాకపోకలతో నిత్యం సందడిగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తులు అత్యధికంగా స్వామివారి సేవలోపాల్గొం టారు. వచ్చిన భక్తులకు సదుపాయాలు కల్పించడానికి ఆలయ అధికారులు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారు. భక్తుల విడిది, ఉచిత భోజనం, కాలక్షేపం కోసం మహాగణపతి స్తోత్రం లాంటి వసతులన్ని సమకూర్చారు.

కోర్కెలు తీర్చే స్వామి...
ఏ క్షేత్రానికైనా ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంటుంది. కోర్కెలు తీర్చే దేవతగానో, మొక్కులు తీర్చే దేవుడుగానో ఒక్కో ఆలయం ఒక్కో రకంగా భక్తుల హృదయాలలో పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. అయితే ఒకే ఆలయం రెండు విశేష ప్రాముఖ్యతలకు ప్రాతినిథ్యం వహిం చడం అరుదు. అలాంటి ఆలయాల్లో చిత్తూరు పట్టాణానికి 12 కిలోమీటర్ల దూరంలో బహుదానది తీరంలో కాణిపాకం వెలసిన కాణిపాక క్షేత్రం ఒకటి.

కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయ కస్వామి దేవస్థానంలో ఒక వైపు భక్తులకు వరాలు ఇచ్చే దేవుడుగా, మరోవైపు ప్రమాణాలతో సత్య శోధన చేసి దేవదేవుని క్షేత్రంగా ప్రసిద్ది గాంచింది. కాణిపాకం శ్రీవరసిద్ది వినాయకస్వామి దర్శనా ర్థం నిత్యం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారు విశేషంగా ఆకర్షిస్తూ భక్తుల పాలిట కొంగుబంగారమై ప్రత్యేకత సంతరించుకున్నారు.

ఆలయ చరిత్ర...
ఈ ఆలయాని
కి సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతోంది. తొలుత ఈ గ్రామాన్ని విహారపురి అని పిలిచేవారు. ఇక్కడ జన్మతః మూగ, చెవిటి, గుడ్డి అయిన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకొని జీవనం గడిపేవారు. వీరు ఒకరోజు ఏతం తో నీటిని తోడుతూ పొలాలకు పారిస్తుండగా నీటి మట్టం తగ్గిపోవ డంతో ఏతం బాన బావి అడుగుకు తగిలి ఖంగుమని శబ్ధం చేసిం ది. చూస్తే వినాయకుడి విగ్రహం కనపడింది. తల వెనుక భాగానికి ఏతం తగలడంతో అక్కడ ఊటలాగా రక్తం రావడం ప్రారంభమైంది.

kanipakam1 

వినాయకుని రక్తజలంతో వారి శరీరాలు ప్రక్షాళన అయ్యాయని ప్రతీతి. దీంతో మూగ వానికి మాటలు వచ్చాయి. చెవిటి వారికి శ్రా వ్యంగా వినపడింది. గుడ్డివానికి చూపు వచ్చింది. దీంతో ముగ్గురు సోదరులు ఆ గ్రామస్థులకు తెలియజేశారు. గ్రామ ప్రజలు వచ్చి బావిలో స్వామివారికి పూజలు నిర్వహించారు. తరువాత ఎంత తవ్వినా స్వామి వారి విగ్రహం చివరిభాగాన్ని కనుక్కొలేకపోయా రు. అందు చేత విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు చేయసాగారు.

భక్తులు వినాయకునికి నారికేళ ఫలాలు ఇష్టమని ఒక్క క్షణం నిలప కుండా కొబ్బరి కాయలు కొట్టసాగారు. స్వచ్చమైన కొబ్బరినీళ్ళతో ఆ బావి నుంచి నీరు పొంగి ప్రవహించింది. బావి నుంచి పొంగి పొరలిన కొబ్బరి నీళ్ళు కాణిమాగాణి అంతా పాకింది. కాణి అనగా ఎకరా పాతికనేల. అలా ఎకరానేల కొబ్బరి నీళ్ళు పాకిన ఆ ప్రాంతా న్ని ‘కాణేపాకం’గా పిలుస్తూ వచ్చారు. కాలక్రమేణా అది ‘కాణిపాకం’ పేరు మారింది.

బహుదానది పేరూ చారిత్రకమే...
స్వామివారు ఆలయ సమీపంలో వెలసి ఉన్న బహుదానదికి కూడా ఆ పేరు రావడానికి మరో కథ ప్రచారంలో ఉంది. కాణిపాకం స్వ యంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి వారిని దర్శించుకునేందుకు శంఖుడు, లిఖుతుడి అనే ఇద్దరు సోదరులు కాలినడకన బయలు దేరారు. నడకతో అలిసిపోయిన వారు ఒక మామిడి చెట్టు కింద మిశ్రయించారు. ఆకలితో ఉన్న లిఖుతుడు అన్నమాటను పెడచెవి న పెట్టి మామిడి పండు కోసుకొని తిన్నాడు. ఈ విషయం తెలిసిన రాజు అతని రెండు చేతులను ఖండించి వేయించాడు. దీంతో దుఖఃసాగరంలో మునిగిన ఆ సోదరులు ఆలయ సమీపంలో ఓ కొలనులో మునగడంతో లిఖితునికి చేతులు వచ్చాయి. చేతులు ప్రసాదించిన తీర్ధం కావడంతో దానిని ‘బహుదానది’ అన్న పేరు స్ధిరపడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

శివ, వైష్ణవ క్షేత్రం...
కాణిపాకం శివ వైష్ణవ క్షేత్రాల నిలయం, శ్రీ స్వయంభు వరసిద్ది వినాయకస్వామితో పాటు మురగ దాంబిక సమేత శ్రీమణికంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీవరదరాజులు స్వామి ఆలయం, శ్రీవీరాంజనే యస్వామి ఆలయం, నవగ్రహాల యం ఉన్నాయి. శివుడు, విష్ణువు ఒకే పుణ్యక్షేత్రంలో అదీ ఒకే ప్రాం గణంలో ఉండడంతో కాణిపాకక్షే తాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా కూడా పిలుస్తారు.

ప్రమాణాలకు నెలవు - స్వామివారి కొలువు...
kanipakam 

వివాదాలను, సవాళ్ళను, ప్రతి సవాళ్ళను పరీక్షించుకునేందుకు ప్రజలు చేసే ప్రమాణాలకు కాణి పాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి ఆలయం ప్రధాన స్దావరంగా నిలు స్తోంది. దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకు డుగా కీర్తి గడించిన స్వామి ఎదుట సత్యప్రమాణం చేస్తే తప్పుడు ప్రమాణం చేసిన వ్యక్తికి ప్రతిఫలం అనుభవిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాణిపాకం ఆలయం సత్య ప్రమాణాలకు ప్రసిద్ది చెందిం ది. రాజకీయ ఆరోపణలు నుంచి తేలికపాటి ఆరోపణలు వరకు కాణిపాకం ఆలయంలో శ్రీవినా యకస్వామి ముందు సత్య ప్రమ మాణం చేయడానికి కోరుకోవడం ఆనవాయితీగా మారింది.

ఈ కాణి పాకం ఆలయంలో ప్రతిరోజు సాయంకాలం 5:30 నుంచి 6 గంటల వరకు తప్పు చేసిన వారు, చేయని వారు ఇద్దరు 5116 రూపాయలు చెల్లించి ఇద్దరే స్వామివారి ముందు వెళ్ళి సత్య ప్రమాణం చేస్తుంటారు. ఇందులో తప్పుడు సత్యప్రమా ణం చేయదలచిన వారు వెనుకడుగు వేస్తారు. ఇక్కడ ప్రమాణం చేస్తే సమస్య పరిష్కామైనట్లేనని ప్రజల నమ్మకం. గతంలో న్యాయస్థానా లు కూడా కాణిపాకంలో చేసిన సత్యప్రమాణాలకు ప్రధాన్యత ఇచ్చేవి.

వరాల మారాజు...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి భక్తులకు వరాల నిచ్చే మారాజుగా భక్తులచే కొని యాడబడుతున్నాడు. గ్రహపీడ తులు, దీర్ఘకాలిక రోగగ్రస్థులు, వ్యసనపరులు, వివాహం కాని వారు, పలు రకాల సమస్యలు ఉన్న భక్తులు ఇక్కడ మొక్కుకుంటే వారి ఇబ్బందులు తొలగడంతో పా టు ప్రశాంత జీవనం దొరుకుతుం దని భక్తుల నమ్మకం.

10 కిలోమీటర్ల దూరంలో అర్ధగిరి...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి వారి దర్శన అనంతరం... 10 కి.మీ దూరం లో వెలసిన అర్ధగిరి శ్రీవీరాంజనే య స్వామివారి సందర్శనార్ధమై పలువురు భక్తులు తరలివెళ్ళడం ఆనవాయితీగా మారింది. చిత్తూ రు నుంచి ప్రతి అర్ధగంటకు ఇక్క డికి ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు.

అర్ధగంటకో ఆర్టీసి బస్సు...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయక స్వామివారి సందర్శనార్థమై వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఎ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి వారు చిత్తూరు నుంచి కాణిపాకం వరకు ప్రతి పది నిమిషాలకొక్క ఆర్టీసి బస్సు సర్వీసులు నడుపుతున్నారు. అదే విధంగా తిరుపతి నుంచి కాణిపాకం వరకు ప్రతి అర్థగంటకొక్క ఆర్టీసి బస్సు సర్వీసు కలదు. వేలూరు (బంగారుగుడి), బెంగుళూరు, నెల్లూరు, హైదరాబాద్‌లకు కూడా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది.

నానాటికీ పెరుగుతున్న విగ్రహానికి కవచాలే నిదర్శనం...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి వారు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారని భక్తుల నమ్మకం. దీనిని స్వామివారి కవచాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా అరగొండ గొల్లపల్లి గ్రామానికి చెందిన బెజవాడ సిద్దయ్యనాయుడు, లక్ష్మయ్య దంపతులు స్వామివారికి చేయించిన వెండి కవచం నేడు స్వామివారికి సరిపోవడంలేదు. స్వామివారు ఆవిర్భవించినపుడు కనిపించిన బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది స్వామివారు పెరుగుతున్నారనడానికి నిదర్శనం. అందుకు స్వామివారు స్వయంభువునిగా ఖ్యాతిపొందారు.


- టి.గిరి, SuryDaily,
ఐరాల మండలం, చిత్తూరు జిల్లా

వ్యాసుడు ప్రతిష్ఠించిన.... అయినవిల్లి గణపతి

సప్తనదీ సంగమ ప్రాంతం... గోదావరీ తీరం... పచ్చని కొబ్బరిచెట్లు, వరిపొలాలు సోయగాల మధ్య అలరారే కోనసీమలో వెలిసిన అయినవిల్లి శ్రీసిద్ధివినాయక ఆలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ప్రతీ శుభకార్యానికి ముందు అయినవిల్లి సిద్ధివినాయకుని పూజిస్తే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ganapathi 

అయినవిల్లి వినాయకునికి విఘ్నాలను తొలగించే స్వామిగా ప్రసిద్ధి చెందారు. కోనసీమలో ఉద్యానవనాల మధ్య గౌతమీ, వృద్ధగౌతమీ గోదావరి పాయల సమీపంలో అయినవిల్లి సిద్ధివినాయకుని ఆలయం నెలకొంది.

ఆలయ చరిత్ర...
దక్షప్రజాపతి ద్రాక్షారామంలో దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్ననాయకు డైన ఈ వినాయకుడిని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణం తెలుపుతోంది. వ్యాసమహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడైన వినాయకుని ప్రతిష్టించాడని మరొక కథ వ్యాప్తిలో ఉంది. స్వయంభు అయిన ఈ సిద్ధి ప్రి యుడు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే సిద్ధివినాయకుడిగా పేరొందారు. దక్షప్రజా పతి తలపెట్టిన యాగానికి కుమార్తె అయిన శచీదేవిని పిలువలేదు. అయినా శచీదేవి దక్షుడు తనను పిలవడం మరచెనని తలచి, పరమశివుడు వారించినా దక్షవాటికకు వెళ్లెను.

అక్కడ శచీదేవి తండ్రైన దక్షప్రజాపతి అవమానించగా, ఆమె శతీయాగం చేసెను. దీనితో శివుడు కాల ఉగ్రుడై జఠాధారి అయిన వీరభ ద్రునిచే దక్షయజ్ఞం నాశనం చేసెను. ‘ఆదో పూజ్యో గణాధిపా’ ముందుగా పూ జింపదగ్గ గణపతిని దక్షుడు పూజించకపోవడంతో దక్షయజ్ఞం భగ్నమైందని దక్షుడు తప్పు తెలుసుకుని, మరలా తిరిగి దక్షడు యజ్ఞానికి ముందు అయినవి ల్లి సిద్ధివినాయకున్ని పూజించి దక్షయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాడని ప్రతీతి.

అయినవిల్లి దేవస్థాన ప్రత్యేకత...
tempul 

సువిశాలమైన ఆవరణలో, ఎతైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాల యంలో క్షేత్రస్వామి శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై భక్తులకు దర్శనమి స్తాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయి తే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహా లకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు వృద్ధికరంగా ఉంటాయని స్థాని కుల ప్రగాఢ విశ్వాసం. రెండు గోపురాలు చూపరులను ఆకట్టుకునే సింహద్వా రాలతో అలరాడే విఘ్నేశ్వర దేవాలయ దర్శనం సందర్శకులను కట్టిపడేస్తుంది. క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవస్వామి ఆలయం, శివాలయం, శ్రీఅన్నపూర్ణాదేవి, శ్రీకాలభైరవస్వామి ఆలయాలు ఆలయప్రాంగణంలో నెలకొన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని పెద్దలు చెబుతారు.

పూజలు, పర్వదినాలు...
ఈ ఆలయంలో ప్రతీనెలా ఉభయ చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతి నిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం సమప్రాధికములుగా కొబ్బరికా యలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మ్రొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని పెద్దల మాట. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని ఉపవాచ.

ఎలా వెళ్లాలి?
ఈ క్షేత్రాన్ని సందర్శించాలంటే కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుండి 26 కి.మీ. ఉంటుంది. రాజమండ్రి నుండి వానపల్లి మీదుగా అయినవిల్లి 60 కి.మీ., కాకినాడ నుండి 65 కి.మీ., కాకినాడ నుండి కోటిపల్లి రేవు మీదుగా 45 కి.మీలు ఉంటుంది. భక్తులు రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రాన్ని సందర్శించవచ్చు.

- వి.రామకృష్ణ, SuryaDaily‌, అమలాపురం

సంపదలొసగే సంపత్‌ వినాయకుడు

సిద్ధిబుద్ధి వినాయకుడు, ఏకదంతుడు, లక్ష్మీగణపతిగా అందరికీ తెలిసిన వినాయకుడు సంపదలు కూడా ఇస్తానని చెప్పేందుకు వెలసిన అవతారమే సంపత్‌ వినాయగర్‌. విశాఖపట్నం జనమేగాక అనునిత్యం చుట్టుపక్కల ప్రాంతాలనుంచి అశేషంగా భక్తజనం వచ్చి స్వామివారిని కొలుచుకుంటుంటారు. అభిషేక ప్రియుడైన ఆ గజాననుడికి కోరిలు తెలియజేసు కుంటుంటారు. భక్తుల కొంగుబంగారంగా స్వామి విరాజిల్లుతున్నారు.

sampath1 

విశాఖ నగర నడిబొడ్డున వెలసిన శ్రీసంపత్‌ వినాయగర్‌ స్వామి భక్తుల నుండి అశేష పూజులందు కుంటున్నారు. ధూప దీప నైవేద్యాలతో, నిత్యపూజల తో ఆలయం కళకళలాడుతోంది. అభిషేక, అలంకారాలకు శ్రీసంపత్‌ వినా యగర్‌ స్వామి దేవాలయం ఏకైక ప్రత్యేకత. నగరంలో గణనాధుని ఆలయల్లో ప్రత్యేకత చాటుకున్న దేవాలయం శ్రీసంపత్‌ వినాయగర్‌ దేవాలయం. భక్తుల పాప ప్రక్షాళనతో పాటు కొర్కేలు తీర్చే ప్రభువుగా గణనాధుడు ప్రసిద్ధికెక్కారు.

చరిత్ర ఎంతో ఘనం...
నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ (ఆశీలుమెట్ట) సమీపంలో... 1962లో ‘మెసర్స్‌ ఎస్‌జి సంబంధన్‌ అండ్‌ కో’ ఆవరణంలో స్వర్గీయ ఎస్‌జి సంబంధన్‌, టిఎస్‌ సెల్వగణేశన్‌, టి.ఎస్‌ రాజేశ్వరన్‌ కుటుంబ సభ్యులు శ్రీ సంప త్‌ వినాయగర్‌ స్వామివారి దేవాలయాన్ని స్థాపించారు. దేవాలయం స్థాపించిన కొత్తలో సమీప జాలర్లు ప్రతిరోజు స్వామిని అర్చించి, నమస్కరించి వారి వృత్తిని మొదలుపెట్టేవా రు. ఐదు సంవత్సరాలు తరు వాత కంచి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వహస్తాలతో ‘గణపతి యంత్రం’ స్థాపించారు. 1971లో ఇండియా, పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో విశాఖను రక్షించమని శ్రీసంపత్‌ వినాయగర్‌ స్వామిని వేడుకున్నట్టు చరిత్ర చెబుతోంది.

sampath 

సముద్రంలో ఘాజి అనే వారు సబ్‌మెరైన్‌పై విజయం సాధించిన సమయంలో విశాఖను రక్షించినందుకు ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండర్‌ అడ్మిరల్‌ క్రిష్ణన్‌ 1001 కొబ్బరికాయలు కొట్టి స్వామిని వేడుకున్నారు. అప్పటి నుంచి దేవాలయం మరింత ప్రసిద్ధి చెందినట్టు పూర్వీకులు చెబుతుంటారు. భక్తులు కొనుగోలు చేసే నూతన వాహనాలు స్వామి ముందు వుంచి పూజలు చేయించుకుంటే, భవిష్యత్‌ ఎటువంటి ప్రమాదాలు సంభవించవని భక్తుల విశ్వాసం. ఈ సెంట్‌మెంటు గత 50 ఏళ్ళగా కొనసాగుతోందని ఆలయం అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.మంజువాణి వివరించారు.

దత్తత దేవాలయం అభివృద్ధి...
శ్రీసంపత్‌ వినాయగర్‌ దేవాలయం నిధులతో అనుబంధంగా ఆనందపురం మండలం శోంఠ్యాంకు వెళ్లే మార్గంలో గండిగుండం గ్రామంలో శ్రీ సంపత్‌ వినాయగర్‌ దేవాలయాన్ని స్థాపించారు. ఈ దేవాయలంలో కూడా ధూప దీప నైవేధ్యాలతో నిత్యపూ జలతో కళకళలాడుతోంది. ఆ దేవాలయం పరిధిలో ఆరు ఎకరాల స్థలంలో మూడు కోట్ల రూపాయలతో మొదటి విడతగా మూడు ఎకరాల స్థలంలో ‘వానప్రస్థ ఆశ్రమం’ (వృద్ధాశ్ర మం) నిర్మించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నామమాత్రపు రుసుంతో వానప్రస్థ ఆశ్రమం ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైంది.

- పి.ఎ.రావు, SuryaDaily,విశాఖపట్నం

పర్యావరణ పరిరక్షణకు మూలికా వినాయకుడు

ganesh1 
భారత దేశం సర్వ సంపదలకు నిలయం. సకల ఆయుర్వేద ఔష ధాలకు నిలయం. మన సంస్కృతీ సంప్రదాయాలలో ఆరోగ్య రహ్యస్యాలు ఇమిడి ఉన్నాయి. నాడు పండుగలు భక్తి భావనతో చేసేవారు. వాటి ఆంతర్యాలు, ఆరోగ్య సూత్రాలు అనుభవపూర్వకంగా తెలుసుకుని తెలియజేసేవారు. ఈ నేపథ్యంలో మన పండుగలలో వినాయక చవితికి చాలా గొప్ప విశిష్టత ఉంది. ఆనాడు వనమూలికల తో గణనాథులను తయారుచేసేవారు. వీటిని నీటిలో నిమజ్జనం చేస్తే పర్యావరణానికి మేలు జరిగేది. ఈ విధంగా స్కూటర్‌ మెకానిక్‌ తిరుమ లశెట్టి చంద్రశేఖర్‌ వనమూలికలతో గణనాథుడిని ప్రతిఏటా ప్రతిష్ఠిస్తూ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తుండడం విశేషం.

వినాయక చవితి పర్వదినం నిజంగా మనకు మహా గొప్ప వరం. ఈ పం డుగలో ముఖ్యంగా మట్టి ప్రతిమను మహత్తర మూలికలతో తయారు చేసి ఈ పండుగ చేసేవారు ఆనాడు. అందుకే వినాయక చవితి వస్తోంది అంటే అందరికీ ఆయుర్వేద ఆరోగ్యం అందుబాటులోకి వస్తోందని అను కునేవారు. ఇక మనకు తెలియని ఎన్నో ఔషధాలు ప్రకృతి ద్వారా లభి స్తున్నాయి. మహామూలి కలను ప్రకృతి అందిస్తోంది. ఈ వినాయక చవి తిద్వారా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆనాటి రుషులు ఆకాక్షించారు. ప్రతి ఒక్కరు మూలికలతో వినాయకుడి ని పూజించమని తెలియజేశారు. మూలికలను తెలుసుకునే ప్రయత్నమే ఈ చవితి. కనీసం 21 రకాల ఆకులు కాని, లేదా పండ్లు కాని... అందరికీ అందుబాటులో ఉన్న ఔషధాలను గుర్తించి వ్యాధులకు గురికా కుండా ఈ చవితినాడు ఆ గణపతిని నవరాత్రులు పూజించమని మనకు తెలియజేశారు.

వనమూలికలు, సహజసిద్ధ రంగులతో...
మనం నిత్యం తింటున్న పండ్లు , మొక్కలు, ఆహారంతో పాటు ప్రతి మొ క్కలోనూ ఆయుర్వేదం ఉంది. అయితే నేడు వినాయక చవితికి చేసే గణనాథుల ప్రతిమలను అన్ని రసాయనాలతో తయారుచేస్తున్నారు. ఇవి వినాయక నవరాత్రులలో దవళకాంతులమధ్య ఎంతో శోభాయమా నంగా ఉండవచ్చు. కానీ నిమజ్జనం చేసిన తరువాత వీటిలో వాడిన రసాయన పదార్థాలు భూమిపైన, నీటిపైనా ప్రభావం చూపి వాటిని కలు షితం చేస్తున్నాయి. మట్టి, వనమూలికలు, జాజికాయ, కరక్కాయ, మిరి యాలు, శొంటి, కొబ్బరి పీచు, వస కొమ్ములు , వట్టి వేళ్లు ఇంకా ఎన్నో వనమూలికలు తక్కువ ధరలో నేడు లభ్యమవుతున్నాయి.

ganesh 

వాటితో వినా యకుడిని తయారుచేసి సహజసిద్ధమయిన రంగులను అద్దితే వినాయ క నిమజ్జనం తరువాత ఈ వనమూలికలు నీటిలో కలసి వీటి సారం భూమిలో ఇంకి ఆ ప్రదేశం శుద్ధి చేయబడుతోంది. నీరు ఎప్పుడైతే స్వ చ్ఛంగా తయారవుతుందో రోగాలు చాలా వరకు తగ్గుతాయి. కనీసం ప్రతిఒక్కరు చిన్న మట్టి వినాయకుడిని అయినా మూలికలతో తయారు చేసి వినాయక నవరాత్రుల అనంతరం వారి ఇండ్లలో ఉన్న బావిలో నిమజ్జనం చేసినట్లయితే అందిరికి మంచి ఆరోగ్యకరమయిన తాగునీ రు లభ్యమవుతుంది.

నదీ జలాలకు మేలు...
‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను నదుల్లో నిమజ్జనం చేసినపుడు అవి జల వనరులకు హాని కలిగిస్తున్నాయి. వీటిల్లో ఉండే విష రసాయనాల కారణంగా నీటిలో ఉండే జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. నా వంతుగా పర్యావరణానికి మేలు చేయాలని గత నాలుగేళ్లుగా వన మూలికలతో చేసిన గణేశ విగ్రహాన్ని తయారు చేస్తున్నాను. దీనికి ఔషధ శివలింగ మహా గణపతి అని పేరు పెట్టి పూజిస్తున్నాను. బంకమట్టి, బూరగకాయలు, టెంకాయ పీసు, కొన్ని మూలికలతో కలిపి చేసిన ఈ విగ్రహాన్ని నీళ్ళలో నిమజ్జనం చేసినపుడు ఆ నీరు శుద్ది జరుగుతుంది’ అని స్కూటర్‌మెకానిక్‌ తిరుమలశెట్టి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.


- పీవి రాఘవాచార్యులు,
సబ్‌ ఎడిటర్‌,Surya

Saturday, August 27, 2011

*పర్యావరణ పరిరక్షణకు... ఎకో ఫ్రెండ్లీ గణనాథులు


పర్యావరణ పరిరక్షణకు... ఎకో ఫ్రెండ్లీ గణనాథులు
హిందువులకు ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒక్కటి. పండుగ రోజున వినాయక ప్రతిమ లను ఇంట్లో ప్రతిష్ఠించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిం చడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తర్వాత గణనా థుడిని నిమజ్జనానికి తరలిస్తారు. ఇక వినాయకులను ముందుగా మట్టితోనే తయారుచేసేవారు. కానీ ఆధునికత పెరగడంతో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో గణనాథుల ప్రతిమల ను తయారుచేసి వాటికి కెమికల్స్‌తో కూడిన రంగులద్దుతు న్నారు. దీంతో ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది.

Shilapith-Ganeshవినాయక విగ్రహాలను ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌(పిఒపి)తో తయారుచేయడంతో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోంది. తక్కువ బరువుగా ఉండడంతో పాటు తక్కువ ధరలో లభించే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో గణనాథులను తయారుచేస్తున్నారు.

పిఒపిలో రసాయనాలెన్నో...
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌లో జిప్సమ్‌, సల్ఫర్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియమ్‌ వంటి కెమికల్స్‌ ఉంటాయి. ఇక ప్రతిమలకు వేసే రంగులు మెర్క్యురీ, క్యాడ్మియమ్‌, ఆర్సెనిక్‌, లెడ్‌, కార్బన్‌ వంటి రసాయనాలు కలిగి ఉంటాయి. ఈ విగ్రహాలను అలంకరించేందుకు ప్లాస్టిక్‌, థర్మోకోల్‌ యాక్ససరీస్‌ను వాడతారు. ఇవి బయోడిగ్రేడెబుల్‌ మెటీరియల్సే కాకుండా ఇవన్నీ టాక్సిక్‌ పదార్థాలు. ఇక గతంలో వినాయక విగ్రహాలు చిన్నవిగా ఉండేవి. కానీ నేడు అంగరంగ వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకొని గణనాథుల ప్రతిమలను భారీగా రూపొందిస్తున్నారు. ఫలితంగా ఈ విగ్రహాలను నిమజ్జనం చేయడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది.

  • పిఒపితో తయారై వివిధ రసాయనాలతో కూడిన రంగులతో అలం కరించిన వినాయక విగ్రహాలను సముద్రపు నీటిలో లేదా చెరువు లు, సరస్సులలో నిమజ్జనం చేయడం మూలంగా వీటిలోని రసాయ నాలు నీటిలో కరిగిపోతాయి. పిఒపి మెల్లిగా కరుగుతుంది. ఈ మేరకు హానికలిగించే రసాయనాలను అది వెదజల్లుతుంది. ఎసిడి టీ పెరగడంతో పాటు రసాయనాల మూలంగా నీరు పూర్తిగా కలుషి తమవుతుంది. ఫలితంగా నీటిలోని మొక్కలు, నీటి జీవులు చనిపో తాయి. ముంబయిలో గణనాథుల నిమజ్జనం తర్వాత చేపలు చని పోయి ఒడ్డుకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తాయి.
  • ప్లాస్టిక్‌, థర్మోకోల్‌ వేస్ట్‌, పాలిథిన్‌ బ్యాగ్స్‌ కరగకుండా నీటిలోనే ఉం డిపోతాయి. దీంతో నీటిలో జీవించే ప్రాణులకు వీటి మూలంగా సమస్యలు ఎదురవుతాయి. ఇవి భూమిలోకి చేరుకొని కాలుష్యానికి కారణమవుతాయి. ఫలితంగా స్థానికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర య్యే అవకాశాలుంటాయి.
  • రసాయనాలతో కూడిన గణనాథులను నిమజ్జనం చేసిన నీటిని ఉప యోగించిన వారికి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పాటు చర్మవ్యాధులు వస్తాయి. రక్తం, కంటి సంబంధిత వ్యాధులు కూడా సోకుతాయి.
    పరిష్కారం...
    వినాయక నిమజ్జనం సందర్భంగా పర్యావరణానికి కలిగే హానిని తగ్గించవచ్చు. ఇందుకోసం విగ్రహాల తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  • వినాయక విగ్రహాల తయారీకి పిఒపిని వాడకూడదు. సహజసిద్దమై న మట్టిని ప్రతిమల తయారీకి వినియోగించాలి. ప్రకృతి సిద్దమైన పదార్థాలను విగ్రహాల రూపకల్పనలో వినియోగించాలి. విగ్రహాలకు ఆర్గానిక్‌, వెజిటేబుల్‌ రంగులను ఉపయోగించాలి. గతంలో ఇటువంటి విగ్రహాలు పెద్దగా దొరికేవి కావు. కానీ నేడు పలు స్వచ్చంధ సంస్థలు మట్టితో తయారైన వినాయక ప్రతిమలను తయారుచేసి అతితక్కువ ధరలలో విక్రయిస్తున్నాయి.
  • గణనాథుల విగ్రహాల అలంకరణకు థర్మోకోల్‌ ప్లాస్టిక్‌ను వినియో గించకూడదు. దీనికి బదులుగా వస్త్రం, కలప, పేపర్‌, ఇతర ప్రకృతి సిద్దమైన వస్తువులను వాడడం శ్రేయస్కరం.
  • వినాయక విగ్రహాలను చెరువులు, సరస్సులలో నిమజ్జనం చేయ డానికి బదులు ప్రత్యేకంగా ఇంటి వద్ద ఏర్పాటుచేసిన నీటి టబ్‌, ట్యాంక్‌లో నిమజ్జనం చేయడం మంచిది.
  • కొందరు మెటల్‌ లేదా రాతితో తయారైన వినాయక విగ్రహాన్ని పండుగ సందర్భంగా ప్రతిష్టించుకుంటారు. ఈ విగ్రహాలను నీటిలో ముంచి కొంత సేపటి తర్వాత బయటకు తీసి తిరిగి ఇంటికి తీసుకో వడం చేస్తుంటారు కొందరు. ఈ విధంగా చేయడం మంచిదే.
  • వినాయక విగ్రహాలకు వేసిన పూల దండాలు, ఆర్గానిక్‌ మెటీరియ ల్స్‌ను తీసి గార్డెన్‌లలో మొక్కలకు ఎరువులుగా వినియోగించుకోవ చ్చు. నీటిలో వేయడం కంటే ఇది మంచి పద్దతి.
  • వినాయక నిమజ్జనం సందర్భంగా పాటలు పాడడం, నృత్యాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కానీ శబ్ద కాలుష్యం కాకుండా నియంత్రణలో పాటలు ఉండేలా చూసుకోవాలి.
  • ఎకో - ఫ్రెండ్లీ గణనాథుల తయారీలో యుగపథ్‌
    దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి అనంతరం నిమజ్జనం చేయడం ఆనవారుుతీగా వస్తోంది. భారీ ఊరేగింపుతో వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తారు. ప్రతి ఏటా దేశంలో కోట్లాది వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు. రసాయనాలతో కూడిన ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, రంగులతో ఈ విగ్రహాలను తయారుచేయడం మూలంగా నిమజ్జనం చేసిన చెరువులు, సరస్సులు, సముద్రాలు కలుషితమవుతున్నారుు.

    దీన్ని దృష్టిలో పెట్టుకొని పలు స్వచ్ఛంద సంస్థలు ఎకో-ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను తయారుచేయాలని పిలుపునిస్తున్నారుు. ఇటువంటి సంస్థల్లో ఒకటి మహారాష్ట్ర పూణె నగరానికి చెందిన యుగపథ్‌. ఈ సంస్థ గత రెండేళ్లుగా పూణె నగరంలో పర్యావరణానికి హాని కలగని గణనాథులను వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తోంది.

    vinayaka 
    పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేస్తున్న సంస్థ యుగపథ్‌. ఈ సంస్థను రెండు సంవత్సరాల క్రితం పర్యావరణ ప్రేమికులైన కొందరు యువకులు కలిసి ప్రారంభించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఎకో-ఫ్రెండ్లీ గణనాథుడు రూపుదిద్దుకునేలా వీరంతా కృషిచేస్తున్నారు.

    ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారైన వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు రెండు సంవత్సరాల క్రితం వినాయక నిమజ్జనానికి ముందు మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. రసాయనిక రంగులతో తయారైన విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడానికి బదులుగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ట్యాంకులలో నిమజ్జనం చేయాలని కోరారు. కాని వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గణేష్‌ చిత్రశాల సభ్యులు ఎకో-ఫ్రెండ్లీగా వినాయకులను తయారుచేసేందుకు వర్క్‌షాపులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

    YTRAJGANESH 
    ‘వినాయక చవితి నిమజ్జనం ఊరేగింపులో మునిగితేలిన వారెవరూ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు. పర్యావరణ పరిరక్షణకు విగ్రహాలను మేము ఏర్పాటుచేసిన ట్యాంకుల్లో నిమజ్జనం చేయాలని కోరినా ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో విగ్రహాల తయారీలో మార్పులు తీసుకురావడం మేలని భావించాము’ అని యుగపథ్‌ వ్యవస్థాపక సభ్యుడు సుహిల్‌ భట్టడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గత ఏడాది వారు పూణెలో ఓ వర్క్‌షాపును నిర్వహించగా దాదాపు 100మంది వినాయక ప్రతిమలను తయారుచేసేవారు అందులో పాల్గొన్నారు. సాధారణ మట్టితో తయారయ్యే విగ్రహాలను తయారుచేయడం వల్ల కలిగే లాభాలను వారు విగ్రహాల తయారీదారులకు వివరించారు.

    ganesh 
    రసాయనాలతో కూడిన విగ్రహాల తయారీకి బదులుగా సహజసిద్దంగా లభించే రంగులతో విగ్రహాలను తయారుచేయాలని వారు కోరారు. ‘లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ మహారాష్టల్రో వినాయక ఉత్సవాలను ప్రారంభించినప్పుడు మట్టితో తయారైన విగ్రహాల తయారీకి కృషిచేశారు. చెరువుల ఒడ్డున కూర్చొని మట్టిని తెప్పించి ఆయన విగ్రహాలను తయారుచేయించేవారు. పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారైన గణనాథులే మేలని ఆయన అప్పుడే చెప్పారు. కానీ నేడు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో విగ్రహాలను తయారుచేయడం మూలంగా నీరు కలుషితమవుతోంది.

    పిఒపిలోని రసాయనాల మూలంగా నీటిలో జీవించే చేపలు వంటి ప్రాణులకు హానికలుగుతోంది’ అని యుగ్‌పథ్‌ సభ్యుడు సలీల్‌ రణాడె పేర్కొన్నారు. ఇక యుగపథ్‌ ఈ ఏడాది దాదాపు 500 మంది వినాయక విగ్రహాల తయారీదారులకు ఎకో-ఫ్రెండ్లీ విగ్రహాల తయారీలో శిక్షణనిచ్చింది. ఈ వర్క్‌షాపు ఈనెల 6న ప్రారంభమై శుక్రవారం ముగిసింది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు శిక్షణ కొనసాగింది. మట్టితో వినాయక విగ్రహాలను తయారుచేసి వాటికి ప్రకృతిసిద్దంగా లభించే రంగులను అద్దడం గురించి వివరించారు.
     
పర్యావరణానికి హాని కలిగించని సహజసిద్ధ రంగులు

వినాయక ప్రతిమల తయారీకి కెమికల్స్‌తో కూడిన రంగులను వాడుతున్నారు. ఫలితంగా ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే కాలుష్యం వెలువడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రసాయనాల రంగులకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన రంగులను వాడితే పర్యావరణానికి మేలు జరుగుతుందని పర్యావరణ ప్రేమికులు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎకో-ఫ్రెండ్లీ గా ఉండే నేచురల్‌ డైస్‌ వాడాలని ప్రచారాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు గత వారం వినాయక విగ్రహాలను తయారుచేసే వారితో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కెమికల్స్‌తో కూడిన రంగులకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధ రంగుల వాడకాన్ని గురించి ఈ సందర్భంగా వివరించారు.

ganesha 
రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఎపి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పిసిబి) ఎకో-ఫ్రెండ్లీ గణనాథులు రూపుదిద్దుకునేలా కృషిచేస్తోంది. రసాయనాలతో కూడిన రంగులతో తయారైన గణనాథులను హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం మూలంగా అందులోని నీరు కలుషితమవుతోంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా హైదరాబాద్‌లోని విగ్రహాల తయారీదారులతో గత వారం సమావేశాన్ని ఏర్పాటుచేశారు బోర్డు అధికారులు. ఈ సమావేశంలో నేచురల్‌ డైస్‌ గురించి తెలియజేశారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌, నాగోల్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 400మంది విగ్రహాల తయారీదారులు సమావేశంలో పాల్గొన్నారు. వారికి సింథటిక్‌ డైస్‌ను గణనాథుల తయారీకి వాడితే పర్యావరణానికి కలిగే హాని గురించి వివరించారు.

అధ్యయనం...

పిసిబి అధికారుల అధ్యయనం లో సింథటిక్‌ డైస్‌తో తయారైన గణనాథులను నీటిలో నిమజ్జ నం చేయడం మూలంగా నీరు పూర్తిగా కలుషితమవుతున్నట్టు తేలింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, కెమికల్‌ పెయింట్స్‌లో మెర్క్యురీ, క్యాడ్మియమ్‌, లెడ్‌ కెమికల్స్‌ ఉంటాయి. ఇవి నీటిలో జీవించే ప్రాణులకు హాని కలిగిస్తు న్నాయి.

హాని కలగని...

vinayaka 

సహజసిద్ధంగా తయారైన రంగులను వాడటం మూలంగా నీటి కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. చెట్లు, పుష్పాలు, కూరగాయల నుంచి తయారయ్యే ఈ రంగులు వినాయకుడి వాడడం శ్రేష్టం. ఈ రంగులు సంప్రదాయబద్దంగా కూడా ఉంటాయి. ఇక ఎకో-ఫ్రెండ్లీ డైస్‌ ఎండిన పువ్వులు, ఆకులు, కొమ్మలు, విత్తనాల నుంచి ఎక్కువగా తయారుచేస్తున్నారు. వీటితో అందంగా, ఆకర్షణీయంగా ఉండే రంగులు రూపొందుతాయి. ఈ రంగులు నీటిలో సులభంగా కరిగిపోతాయి. రసాయనాలు అతి తక్కువగా ఉండడమే కాదు ఇవి నాన్‌ అలర్జిక్‌గా కూడా ఉంటాయి.

వివిధ రకాలుగా...
సహజసిద్ధ రంగులను పలు రకాలుగా తయారుచేస్తున్నారు. అడవిలోని పలు రకాల చెట్ల నుంచి వీటిని రూపొందిస్తున్నారు. రావిచెట్టు, జట్రోఫా, బల్సామ్‌, యూకలిప్టస్‌ చెట్ల నుంచి ఈ రంగులను తయారుచేస్తున్నారు. నిమ్మ, గోరింటాకు, టేకు చెట్ల నుంచి సైతం సహజసిద్ధ రంగులను రూపొందిస్తున్నారు. వీటి తయారీ గురించి పిసిబి అధికారులు గణనాథుల తయారీదారులకు వివరించారు.